

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సంస్థ 75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా ప్రత్యేక స్మారక నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లతో ముచ్చటించిన ప్రధాని.. భారతదేశ అభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ అందించిన విశేష సేవలను గుర్తుచేశారు. గత ఏడున్నర దశాబ్దాలుగా దేశం అనేక రంగాల్లో గణనీయమైన మార్పులను సాధించిందని, ఈ ప్రయాణంలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
1951లో ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పూర్ దేశంలోనే తొలి ఐఐటీగా గుర్తింపు పొందిందని మోదీ తెలిపారు. సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ఈ సంస్థ మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు. ప్రారంభ దశలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను తయారు చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగాల్లోనూ దేశానికి సేవలందించిన ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని కొనియాడారు. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన తర్వాత భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలోనూ ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహించే స్థాయికి వారు ఎదిగారని ప్రశంసించారు.
మరోవైపు, ఐఐటీ ఖరగ్‌పూర్ ఉన్న ప్రాంతానికి భారత స్వాతంత్య్ర పోరాటంతో ప్రత్యేక అనుబంధం ఉందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతం స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించిన శిబిరంగా ఉండేదని పేర్కొన్నారు. ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం పోరాడిన ఈ నేల.. నేడు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆలోచనలకు, కలలకు పరిమితులు విధించుకోవద్దని సూచించారు. కొత్త అవకాశాలను అన్వేషిస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. 'బ్రేక్ ద లిమిట్.. అన్‌లాక్ ద పాసిబిలిటీస్' (పరిమితులను అధిగమించండి.. అవకాశాలను సాకారం చేసుకోండి) అనే సందేశంతో యువతలో స్ఫూర్తి నింపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!