

భూ అక్రమాలు, ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం జీఓ నంబర్ 134 ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 అంశాలపై విచారణ చేపట్టనున్న కమిటీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, టి. హరీశ్‌రావు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, భాగస్వాములకు సంబంధించినట్లు పేర్కొన్న భూముల వివరాలను పరిశీలించనుంది. సిద్దిపేట, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి విచారణ జరపనుంది.
కమిటీకి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేనను ఛైర్‌పర్సన్‌గా నియమించారు. రిజిస్ట్రేషన్లు-స్టాంపులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులు, జనగామ జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ఎసైన్డ్, భూదాన్, సీలింగ్, జాగీర్, ఇనాం, అటవీ భూములు, భూసేకరణ, నీటి వనరుల పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు, భూ రికార్డుల నిర్వహణలో అవకతవకలు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. ఉల్లంఘనలకు బాధ్యులను గుర్తించడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయనుంది. అవసరమైన ప్రభుత్వ రికార్డులు, పత్రాలను సంబంధిత శాఖల నుంచి సేకరించే అధికారం కమిటీకి కల్పించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!