

జనాభా తగ్గుదల, జననాల రేటు క్షీణతను అరికట్టేందుకు జపాన్‌లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) భారీ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రతిపాదించింది. మూడో సంతానం, ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు 10 మిలియన్ యెన్లు (సుమారు 62,700 డాలర్లు) విలువైన ఆర్థిక సహాయం అందించాలని సూచించింది. నవంబర్ 27న పార్టీ జనాభా వ్యూహ విభాగం ఈ ప్రతిపాదనను రూపొందించింది. పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చును తగ్గించి, ఎక్కువ మంది పిల్లలను కనడానికి కుటుంబాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఈ ప్రతిపాదన జపాన్‌లోని కుటుంబాల కోసం రూపొందించింది తప్ప, విదేశీయులకు మాత్రమే ఉద్దేశించినది కాదు.
ఈ ఆర్థిక సాయంతో పాటు పన్ను రాయితీలు, ఉచిత చిన్నారుల సంరక్షణ సదుపాయాల విస్తరణ, సంతాన సాఫల్య చికిత్సలకు మరింత మద్దతు వంటి అంశాలను కూడా LDP ప్రతిపాదించింది. ఈ సిఫారసులను ప్రధాని సనాయే తకాయిచికి సమర్పించి, 2027 ఆర్థిక విధానాల్లో భాగంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని పార్టీ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా ప్రభుత్వ ఆమోదం లభించలేదు. అధికారిక పథకంగా కూడా అమల్లోకి రాలేదు. జపాన్‌లో జననాల రేటు తగ్గుతూ, వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలను పరిశీలిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!