

ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైలు కోచ్‌లలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వేలు బహుళస్థాయి భద్రతా చర్యలను అమలు చేస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటం, గాయపడిన వారికి చికిత్స అందించడం, ప్రయాణికులకు తక్షణ సహాయం చేయడమే రైల్వేల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి రైలు బోగీలో కనీసం రెండు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్యాంట్రీ కార్లలో వాటర్ మిస్ట్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అత్యవసర సమయంలో ప్రయాణికులు సమాచారం అందించేందుకు ప్యాసింజర్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సదుపాయాన్ని కల్పించామని, రైల్ మదద్ హెల్ప్‌లైన్ 139 ద్వారా తక్షణ సహాయం అందిస్తున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 177 యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లు, 100 బ్రేక్‌డౌన్ క్రేన్లు, 170 మెడికల్ రిలీఫ్ యూనిట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఆధునిక భద్రతా వ్యవస్థలు, అత్యవసర స్పందన చర్యలతో రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!