

ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు జరిగిన ప్రయత్నాన్ని ధైర్యంగా అడ్డుకుని ప్రయాణికుల ప్రాణాలను కాపాడినట్లు వార్తల్లో నిలిచిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను గౌరవించేందుకు రాజస్థాన్‌లోని మేవాడ్ కళాకారులు ప్రత్యేక తలపాగాను రూపొందించారు. ఈ తలపాగాలో కాషాయ, నీలం రంగులను ప్రత్యేకంగా ఉపయోగించారు. రాజస్థాన్ ధైర్యసాహసాలకు కాషాయ రంగు ప్రతీకగా నిలిస్తే, నీలం రంగు ఆకాశాన్ని సూచిస్తుంది. అత్యవసర పరిస్థితి ఎదురైన సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్యను గుర్తుచేస్తూ తలపాగా ముందు భాగంలో ‘174’ అనే సంఖ్యను అమర్చారు. ఈ సంఖ్య కింద ‘కరేజ్’ (ధైర్యం) అనే పదాన్ని పొందుపరిచి కెప్టెన్ సాహసానికి ప్రతీకగా తీర్చిదిద్దారు.
ఉదయ్‌పుర్‌కు చెందిన జినేశ్, జయంత్ కొఠారి ఈ ప్రత్యేక తలపాగాను రూపొందించేందుకు నాలుగైదు రోజుల పాటు శ్రమించినట్లు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ ప్రదర్శించిన ధైర్యానికి గుర్తుగా ఈ కానుకను అందించాలని భావించినట్లు పేర్కొన్నారు. తలపాగాను కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు చేరవేసేందుకు సహాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక కానుక ద్వారా కెప్టెన్ సాహసాన్ని గౌరవించడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని కళాకారులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!