

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటిస్తున్న సమయంలో ఆ దేశానికి చెందిన రెండు టీయూ-95 వ్యూహాత్మక బాంబర్లు వియత్నాంలో ప్రత్యక్షమవడం ఆసియాలో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం వియత్నాంలోని డా నంగ్ నగరానికి చేరుకున్న ఈ విమానాలకు తోడుగా మరో రెండు యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. బుధవారం డా నంగ్ విమానాశ్రయంలో కనిపించిన ఈ బాంబర్లు గురువారం వియత్నాంను వీడాయి. అదే సమయంలో అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియతో ముడిపడిన బ్రీఫ్‌కేస్‌ను ఓ అధికారి పుతిన్ వెంట తీసుకెళ్లడం కూడా వార్తల్లో నిలిచింది. ఆసియాలో తన సైనిక ప్రాబల్యాన్ని చాటుకునేందుకే రష్యా ఈ చర్యకు పాల్పడిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం తమ తూర్పు తీరం మీదుగా రెండు టీయూ-95 బాంబర్లు ప్రయాణించాయని తైవాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
రష్యా, వియత్నాం మధ్య 1950 నుంచి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే, 2014 తర్వాత రష్యా యుద్ధ విమానాలు వియత్నాంలో కనిపించడం ఇదే తొలిసారి. మరోవైపు రష్యా విమానాల కదలికలపై జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం తెల్లవారుజామున ఫుకోవా ప్రాంతంలో రష్యా బాంబర్లు తమ గగనతలంలోకి ప్రవేశించి సుమారు ఐదు నిమిషాల పాటు ఉన్నాయని జపాన్ ఆరోపించింది. వాటిని అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను పంపి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. పలు రష్యా యుద్ధ విమానాలు తమ గగనతల రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయని దక్షిణ కొరియా కూడా వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!