

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు రైలు ప్రయాణం ఇప్పటినుంచే భారంగా మారింది. పండగకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా జనవరి 11, 12, 13 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు కూడా అందుబాటులో లేకుండా ‘రిగ్రెట్’ అని చూపిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం 60 రోజుల ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఉండటంతో బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే టికెట్లన్నీ నిండిపోయాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబాద్, హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరే రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఈసారి స్లీపర్ క్లాసుతో పాటు ఏసీ బోగీల్లోనూ రిజర్వేషన్లు వేగంగా పూర్తయ్యాయి. విశాఖపట్నం దురంతో, గరీబ్‌రథ్, వందేభారత్ రైళ్లలోనూ టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు 130 నుంచి 270 వరకు చేరింది. గౌతమి, నారాయణాద్రి, శబరి, కోణార్క్, విశాఖ, గోదావరి, నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లలోనూ రిజర్వేషన్లు దాదాపుగా నిండిపోయాయి. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 9, 10, 11 తేదీలకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండగా.. 12, 13 తేదీలకు వెయిటింగ్ లిస్టు చూపిస్తోంది. హైదరాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం జనవరి 9 నుంచి 13 వరకు టికెట్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ముందుగానే ప్రత్యేక రైళ్లు, జనసాధారణ్ సర్వీసులు ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైళ్లలో టికెట్లు దొరక్కపోవడంతో చాలామంది బస్సులు, ప్రైవేటు వాహనాల వైపు చూస్తున్నారు. అయితే పండగ సమయంలో బస్సుల్లోనూ రద్దీ పెరగడంతో పాటు ఛార్జీలు కూడా అధికమయ్యే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!