

జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ SAP భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత తొలగింపులు సంస్థ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో దాదాపు 9 శాతానికి సమానం. అయితే, ఎంతమందిని తొలగించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులతో చర్చలు పూర్తయిన తర్వాత ఈ సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉంది.
ఐరోపాలోనే అత్యంత విలువైన సాఫ్ట్‌వేర్ సంస్థగా ఉన్న SAP.. సీఈవో క్రిస్టియన్ క్లెయిన్ నేతృత్వంలో ఏఐ ఫస్ట్ వ్యూహాన్ని అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డును ఇప్పటికే రెండుసార్లు పునర్‌వ్యవస్థీకరించింది. ఆరుగురు సభ్యులున్న బోర్డు నుంచి ఇద్దరు వైదొలిగారు. అలాగే, ఉద్యోగాల కోతలకు అవకాశం ఉన్న పోస్టులను గుర్తించాలని అన్ని విభాగాలకు సంస్థ సూచించినట్లు సమాచారం. మరోవైపు, ప్రొడక్ట్ విభాగం చీఫ్ ముహమ్మద్ ఆలమ్ కాంట్రాక్ట్‌ను పొడిగించే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆ విభాగ బాధ్యతలను సీఈవో క్రిస్టియన్ క్లెయిన్ స్వయంగా చేపట్టారు. ఆలమ్ ప్రస్తుత పదవీకాలం మార్చితో ముగియనుంది. కాగా, కస్టమర్ల అవసరాలు, తగిన వ్యాపార వ్యూహాలకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని SAP ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ పనితీరును నిరంతరం సమీక్షిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఉద్యోగాల కోతలపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!