

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్చించినట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకుండా ఉండాలనే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ నెల 27వ తేదీలోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలపై తమకు అవగాహన ఉందని న్యాయస్థానం పేర్కొన్నప్పటికీ, వైఎస్సార్సీపీ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల తదుపరి ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!