

దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాణసంచా నిప్పురవ్వలు, ఇతర కారణాలతో బేగంబజార్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, బండిమెట్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. బేగంబజార్‌లో బాణసంచా నిప్పురవ్వలు పడటంతో ఓ భవనంలో మంటలు వ్యాపించాయి. జీడిమెట్లలోని స్క్రాప్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. మైలార్‌దేవ్‌పల్లిలో హనుమాన్ దేవాలయం సమీపంలోని డెకరేషన్ గోదాంలోనూ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
సికింద్రాబాద్ బండిమెట్ మారుతి వీధిలోని సాయి బాలాజీ డిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు కూకట్‌పల్లి ఆస్బెస్టాస్ కాలనీలోని పేపర్ ప్లేట్లు, టీ కప్పుల తయారీ పరిశ్రమలో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్ ఉత్పత్తుల స్టాక్ గోదాములకు వ్యాపించాయి. నాలుగు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కూకట్‌పల్లి ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!