

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బుధవారం దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం భారత్‌కు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి కానుంది. ఈ సమావేశంలో ఆమె భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం, తాజా పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామంపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, భారత్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. విదేశాల నుంచి అవామీ లీగ్ నేతలు చేస్తున్న రాజకీయ ప్రకటనలపై తమ ఆందోళనలను ఇప్పటికే భారత్‌కు తెలియజేసినట్లు పేర్కొంది. మరోవైపు షేక్ హసీనా ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాల ప్రసారంపై తమ దేశంలో ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేస్తూ, దీనిని ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!