

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు భావోద్వేగ విషయాలను వెల్లడించారు. 1969లో నెలలు నిండకుండానే జన్మించిన కుమారుడిని కోల్పోయిన విషాద ఘటనను గుర్తుచేసుకున్నారు. 1969 జనవరి 18న సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చానని, ప్రసవం రెండు నెలల ముందుగానే జరిగిందని తెలిపారు. ఇంక్యుబేటర్‌లో ఉంచే సమయంలో బిడ్డ మొదటి ఏడుపు వినిపించిందని, రాజీవ్ గాంధీ తనను తీసుకెళ్లి చిన్నారిని చూపించారని పేర్కొన్నారు. అయితే బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని, మరుసటి రోజు ఉదయం బిడ్డను కాపాడలేకపోయామని రాజీవ్ చెప్పడంతో తాను తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యానని వెల్లడించారు. రాజీవ్ కూడా వెక్కివెక్కి ఏడ్చారని, విషయం తెలుసుకున్న ఇందిరా గాంధీ తన పర్యటనను రద్దు చేసుకుని ఆసుపత్రికి వచ్చి తమను ఓదార్చారని గుర్తుచేసుకున్నారు.
చిన్నారి అంత్యక్రియల విషయంలోనూ కుటుంబం పలు సంప్రదాయపరమైన అంశాలను చర్చించిందని సోనియా తెలిపారు. చివరకు మెహ్రౌలీలోని ఫిరోజ్ గాంధీ వ్యవసాయ క్షేత్రంలో బిడ్డను ఖననం చేసినట్లు వెల్లడించారు. ఈ విషాద ఘటనపై ఓ ప్రతిపక్ష పత్రికలో వచ్చిన కథనం తనను మరింత మానసిక వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఆ బాధ నుంచి కుటుంబం మెల్లగా బయటపడిందని తెలిపారు. 1969 అక్టోబర్‌లో మరోసారి తల్లి కాబోతున్న విషయాన్ని రాజీవ్‌కు చెప్పానని, ఆ సమయంలో ఆనందంతో పాటు ఆందోళన కూడా కలిగిందని వివరించారు. అనంతరం 1970 జూన్ 19న రాహుల్ గాంధీకి జన్మనిచ్చినట్లు తన ఆత్మకథలో పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!