

నటి తమన్నా భాటియా ముంబైలోని జుహూ బీచ్లో భక్తులతో కలిసి ఛత్ మహాపర్వ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఛత్ పూజను ఆచరిస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. భక్తుల విశ్వాసానికి, తన పాటపై వారు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు. తన భక్తి గీతం ‘ఛతీ మైయా’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆ పాటలో ఛత్ పూజ సంప్రదాయాలను ప్రతిబింబించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భక్తులు చూపిస్తున్న ప్రేమ తనకు ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని చెప్పారు.
పాట ప్రచార కార్యక్రమాల సందర్భంగా పాట్నా వెళ్లినప్పుడు గంగా హారతిలో పాల్గొన్నానని తమన్నా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో మరోసారి పాట్నాకు వెళ్లి ఛత్ పూజ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. అయితే, తన సొంత నగరమైన ముంబైలోనే పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి ఈ పండుగను జరుపుకునే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఛత్ పూజ ప్రాముఖ్యత, దాని సంప్రదాయాల గురించి తెలుసుకున్న విషయాలు తన జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు. ఈ పండుగతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తమన్నా పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!