

అమెరికా వ్యాప్తంగా కీలక వైమానిక సమాచార వ్యవస్థలో దాదాపు ఐదు గంటలపాటు అంతరాయం ఏర్పడటంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ గందరగోళానికి రక్షణ, సాంకేతిక రంగాల్లో కాంట్రాక్టు పనులు నిర్వహించే ఎల్3హారిస్ (L3Harris) సంస్థ ఏర్పాటు చేసిన ఓ రౌటర్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో ఇప్పటికీ వినియోగిస్తున్న పాత పరికరాలను కొత్త సాంకేతికతతో అనుసంధానించడంలో ఉన్న సమస్యలు బయటపడ్డాయి. దేశంలోని ఏరోస్పేస్ కమ్యూనికేషన్ వ్యవస్థను రాగి తీగల నుంచి ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌కు మార్చే పనులను ఎల్3హారిస్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే అర్కాన్సాస్, టెక్సాస్‌లో ఏర్పాటు చేసిన ఓ రౌటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త రౌటర్ల నుంచి ప్రతి నాలుగైదు సెకన్లకు సుమారు 1,000 కనెక్షన్ ప్రయత్నాలు పాత రౌటర్లకు రావడంతో అవి ఆ భారాన్ని తట్టుకోలేకపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఫలితంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)కు చెందిన పలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో కమ్యూనికేషన్ ఓవర్‌లోడ్ సమస్యలు తలెత్తినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ కూడా ధ్రువీకరించారు.
అమెరికాలో చిన్నపాటి సాంకేతిక పొరపాట్ల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలగడం ఇదే మొదటిసారి కాదు. 2023లో ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్ పొరపాటున కొన్ని ఫైళ్లను తొలగించడంతో విమానయానానికి సంబంధించిన సమాచార వ్యవస్థ దెబ్బతింది. దీంతో దాదాపు 90 నిమిషాలపాటు 11 వేల విమానాలు నిలిచిపోయాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో విమాన సర్వీసులకు అంతరాయం కలగడం అదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజెర్సీలో నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బంది పొరపాటున ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను దెబ్బతీయడంతో ఈశాన్య అమెరికాలో వేలాది విమాన సర్వీసులపై ప్రభావం పడింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు విమానయాన రంగంలో కీలక కమ్యూనికేషన్ వ్యవస్థల భద్రత, నిర్వహణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!