

తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే అంశంపై అంతర్గతంగా సందిగ్ధత నెలకొంది. పార్టీని విస్తరించేందుకు భారీగా చేరికలు చేపట్టాలని అధిష్ఠానం రాష్ట్ర నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బెంగాల్ తరహాలో పెద్దఎత్తున ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, గత ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన పలువురు వలస నేతలు ఓడిపోవడం, కొందరు ఆ తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం, మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటాన్ని రాష్ట్ర నేతలు గుర్తు చేస్తున్నారు.
కొత్తగా చేరికలను ప్రోత్సహిస్తే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న క్యాడర్‌లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న పాత నేతలను పక్కనపెట్టి జంపింగ్ నేతలకు ప్రాధాన్యం ఇస్తే అంతర్గత విభేదాలు పెరగడంతో పాటు పాత నేతలు పార్టీని వీడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నాన్‌లోకల్, పారాషూట్ నేతల కంటే సీనియర్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర నాయకులు కోరుతున్నప్పటికీ, అధిష్ఠానం మాత్రం చేరికలపై వెనక్కి తగ్గడం లేదని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!