

తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణం మిశ్రమంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని, మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించింది.
ఈ ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కల్లూరులో అత్యధికంగా 11.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు మంచిర్యాల జిల్లా దండేపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!