

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తామని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశానికి సౌత్ యార్క్‌షైర్, వెస్ట్ యార్క్‌షైర్, యార్క్ అండ్ నార్త్ యార్క్‌షైర్ ప్రాంతాలకు చెందిన మేయర్లు ఆలివర్ కోపార్డ్, ట్రేసీ బ్రాబిన్, డేవిడ్ స్కేత్ నేతృత్వం వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడంతో పాటు ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తోందని సీఎం వివరించారు.
30 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరలో విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పునరుజ్జీవం ద్వారా రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, నైట్ ఎకానమీ విస్తరణకు ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’కు బ్రిటన్ ప్రతినిధులను ఆహ్వానించారు. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి బ్రిటన్ బృందం ఆసక్తి చూపింది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం హైదరాబాద్ పరిధిలో ఐటీ, సేవలు, ఆవిష్కరణలకు, మధ్య ప్రాంతాల్లో తయారీ, లాజిస్టిక్స్‌కు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!