

రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26న తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అర్హత పొందిన 4,63,857 మందికి అదే రోజు చేయూత పెన్షన్లను మంజూరు చేసి, నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు ఈ పెన్షన్లు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.
అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డకు చీర అనేది కేవలం వస్త్రం మాత్రమే కాదని, పుట్టింటి ఆత్మీయత, గౌరవానికి ప్రతీక అని సీతక్క పేర్కొన్నారు. మహిళలకు చీరలు అందించడంతో పాటు వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సదుపాయాలు కల్పిస్తూ ఆర్థిక సాధికారతకు తోడ్పడుతున్నట్లు వివరించారు. చేయూత పెన్షన్ల ద్వారా బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా, ఇందిరమ్మ చీరల ద్వారా మహిళలకు గౌరవం, ఆత్మీయత అందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!