

రాష్ట్ర ప్రభుత్వ సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ డిజిటల్ పోర్టల్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌లెన్స్’ పురస్కారాన్ని ఈ పోర్టల్ అందుకుంది. ముంబైలో నిర్వహించిన ‘పరివర్తన్ అవార్డ్స్-2026’ కార్యక్రమంలో మహారాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ బీజే సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్ రవి గుప్తా, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి కే. విద్యాసాగర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి డిజిటల్ పోర్టల్‌ను రూపొందించింది. గతంలో కాగితాలపై ఫిర్యాదులు స్వీకరించే విధానానికి బదులుగా ఆధునిక, పారదర్శకమైన డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేసినందుకు ప్రజావాణికి ఈ జాతీయ పురస్కారం లభించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!