

అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలు పనిచేస్తున్న ఉపగ్రహాలకు ముప్పుగా మారుతున్నాయి. జీపీఎస్ నావిగేషన్, వీడియో కాల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, వాతావరణ అంచనాలు, ప్రత్యక్ష క్రీడా ప్రసారాలు వంటి అనేక సేవలు ఉపగ్రహాలపై ఆధారపడి ఉండటంతో వాటి భద్రత కీలకంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో తెలుగు ఏరోస్పేస్ శాస్త్రవేత్త డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్ స్పేస్’ అనే అంతర్జాతీయ స్టార్టప్‌ను ప్రారంభించారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఇప్పటివరకు భూకక్ష్యలోకి సుమారు 27 వేల పేలోడ్లు పంపించగా, వాటిలో దాదాపు 16 వేల ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. మరోవైపు, సుమారు 50 వేల పనికిరాని ఉపగ్రహాలు, 14 కోట్ల చిన్నచిన్న వ్యర్థాల ముక్కలు కక్ష్యలో ఉన్నట్లు అంచనా. ఇవి అత్యంత వేగంతో ప్రయాణిస్తూ పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొని భారీ నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. అందువల్ల అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం అత్యవసరమని ఫణీంద్ర భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు సమీపంలోని చాటపర్రుకు చెందిన ఫణీంద్ర భీమవరంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఐఐటీ కాన్పూర్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌లో థర్మల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇస్రోలో 14 ఏళ్లపాటు శాస్త్రవేత్తగా పనిచేస్తూ చంద్రయాన్-2, చంద్రయాన్-3, విక్రమ్ ల్యాండర్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, అంతరిక్ష వ్యర్థాల నిర్వహణపై తనకున్న పరిజ్ఞానం ఆయనను స్టార్టప్ స్థాపన దిశగా నడిపించాయి. కాస్మో సర్వ్ స్పేస్ ఐడియా దశలోనే రూ.28 కోట్ల పెట్టుబడులు పొందినట్లు సమాచారం. కీటకాలను పట్టుకునే కొన్ని మొక్కల స్ఫూర్తితో రూపొందించిన ‘సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్’ సాంకేతికత ద్వారా వ్యర్థాలను సున్నితంగా పట్టుకుని భూమి వాతావరణంలో సురక్షితంగా తొలగించడమే సంస్థ లక్ష్యం. అంతరిక్ష వ్యర్థాల తొలగింపు ఖర్చును తగ్గించడంతో పాటు, భవిష్యత్తులో ఇంధనం తగ్గిపోయిన ఉపగ్రహాలకు తిరిగి ఇంధనం నింపే కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలనూ ఫణీంద్ర పరిశీలిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!