

దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీల్లో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధమవుతోంది. రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సుమారు 6,000 అదనపు సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని ఐఐటీలు భావిస్తున్నాయి. ఈ కోర్సుల్లో తొలి బ్యాచ్‌లు 2027 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. పరిశ్రమల్లో పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ప్రణాళిక ప్రకారం రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ కోర్సుల్లో సుమారు 5,000 సీట్లు, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మరో 1,000 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్థాయిల్లో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఇందుకోసం 120 మందికి పైగా నిపుణులైన అధ్యాపకులను నియమించే అవకాశం ఉంది. భూపత్-జ్యోతి మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ పలు ఐఐటీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కథనం పేర్కొంది. 2027లో తొలి బ్యాచ్‌లు ప్రారంభమైనప్పటికీ, మొత్తం సీట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఎనిమిది నుంచి పదేళ్లు పట్టవచ్చని అంచనా. ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, అధునాతన రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధన రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!