

ప్రేమికుడి కోసం కాంక్రీట్ గోడ కింద సొరంగం తవ్వి మరీ తప్పించుకున్న పులి కథ ఇది. పశ్చిమ బెంగాల్‌లో పులుల సంతతిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా అధికారులు అక్టోబర్‌లో బిహార్ నుంచి మూడేళ్ల వయసున్న ‘రాణి’ అనే ఆడపులిని తీసుకొచ్చారు. దానిని బుక్సా టైగర్ రిజర్వ్‌లోని ఓ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం రాణి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్‌క్లోజర్ కంచె కింద నాలుగు అడుగుల లోతు వరకు కాంక్రీట్ పునాది ఉన్నప్పటికీ, దాని కింద నుంచి సొరంగం తవ్వుకుని రాణి బయటకు వెళ్లిపోయింది. దీంతో దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు దాదాపు 60 మంది సిబ్బందితో పాటు మూడు కుంకీ ఏనుగులను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు.
రాణి తప్పించుకోవడం ఇది రెండోసారి. బుక్సా టైగర్ రిజర్వ్‌కు తీసుకొచ్చిన రెండు వారాలకే గతంలోనూ అది పారిపోయింది. దాదాపు 13 రోజుల తర్వాత అస్సాంలోని ఓ నది సమీపంలో దాని ఆచూకీ గుర్తించి తిరిగి తీసుకొచ్చారు. ఆ సమయంలో అస్సాం అడవుల్లో ఓ మగపులితో రాణికి అనుబంధం ఏర్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ మగపులి దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతోనే రాణి మరోసారి ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దాని కోసం అటవీ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!