

ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ పేద మహిళలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలపై కడపలోని భారత్ ట్రావెల్స్ యజమాని ఇఫ్తియార్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. సరైన అనుమతులు లేకుండానే మహిళలను మస్కట్, దుబాయ్, కువైట్ తదితర దేశాలకు పంపిస్తున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వారు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం కడపకు చేరుకుంది. కడప వన్‌టౌన్ పోలీసుల సహకారంతో శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఇఫ్తియార్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించింది. ఇప్పటివరకు ఎంతమంది మహిళలను విదేశాలకు పంపించారు? వారిని ఏయే దేశాలకు తరలించారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరపనున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!