

యెమెన్‌లోని హూతీ స్థావరాలపై వైమానిక దాడులకు అమెరికా సైన్యం సిద్ధమైనప్పటికీ.. చివరి నిమిషంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సౌదీ అరేబియా నుంచి సైనిక సాయం కోసం విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో దాడులకు సంబంధించిన సన్నాహాలు జరిగినట్లు సమాచారం. హూతీలు ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాంతాలపై తమ పట్టును పెంచుకుంటుండటంతో సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరిగింది. అయితే హూతీలపై ప్రత్యక్ష సైనిక చర్యలో అమెరికా పాల్గొనడంపై ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
హూతీలపై దాడి నిర్ణయాన్ని మార్చుకోవడానికి అమెరికా అంతర్గతంగా నెలకొన్న ఆందోళనలు కూడా కారణమై ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో మరో సైనిక రంగంలోకి ప్రవేశించడం వల్ల పరిస్థితులు మరింత తీవ్రతరం కావచ్చన్న అభిప్రాయాలు అమెరికా అధికార వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హూతీ రాజకీయ విభాగం సభ్యుడు మొహమ్మద్ అల్ బుఖైతీ ప్రకటించారు. అమెరికా అధికారులతో చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు. సౌదీ అరేబియాకు మద్దతుగా ఇతర దేశాలు సైనికంగా జోక్యం చేసుకోనంతవరకు వారి నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!