

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలను నవంబర్ 26న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తొలి విడతలో సుమారు 4 వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు నగరపాలక సంస్థలు, మరో 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు కూడా పోలింగ్ నిర్వహించే యోచనలో ఎస్‌ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాల్లో వైస్‌ఛైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే ప్రక్రియను నవంబర్ 23న చేపట్టనున్నారు. అవసరమైతే ఈ ప్రక్రియను నవంబర్ 24న కూడా కొనసాగించి పూర్తి చేయనున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!