

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై అభిశంసనకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలిచారు. రక్షణ మంత్రిగా హెగ్సెత్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు. వెనెజువెలా, ఇరాన్‌కు సంబంధించిన సైనిక చర్యల్లో రెండు విజయాలు సాధించారని పేర్కొన్నారు. హెగ్సెత్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని, ఆయనకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి తీర్మానాలతో కాంగ్రెస్ విలువైన సమయాన్ని వృథా చేయకూడదని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఇరాన్‌తో యుద్ధాన్ని నిర్వహించిన తీరుతో పాటు యెమెన్, వెనెజువెలాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో హెగ్సెత్ పాత్రను ప్రశ్నిస్తూ థామస్ మాసీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో మొత్తం ఎనిమిది అభియోగాలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టడం, యుద్ధ సమయంలో పౌరుల రక్షణకు సంబంధించిన చట్టాలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఈ అభిశంసన ప్రయత్నంపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు హెగ్సెత్ ప్రకటించారు. యుద్ధానికి ప్రజాదరణ లేకపోయినా, దేశ భద్రత దృష్ట్యా ఆ చర్యలు అవసరమయ్యాయని ఆయన సమర్థించుకున్నారు. ఈ తీర్మానంపై బుధవారం నాటికి అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!