

గాలి నాణ్యతను పరిశీలించే స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ (IQAir) నివేదిక ప్రకారం, అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం వాషింగ్టన్ డీసీ కొంతసేపు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదైంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన భారీ బాణసంచా ప్రదర్శనల ప్రభావంతో రాజధానిలో గాలి నాణ్యత ఒక్కసారిగా పడిపోయినట్లు నివేదిక పేర్కొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వాషింగ్టన్ నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 8.5 లక్షల టపాసులు కాల్చినట్లు సమాచారం. పర్యావరణంపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరించినప్పటికీ వేడుకలు యథావిధిగా నిర్వహించబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఫైన్ పార్టిక్యులేట్ కాలుష్యం క్యూబిక్ మీటర్‌కు 200 మైక్రోగ్రాముల వరకు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.
ఐక్యూఎయిర్ విడుదల చేసిన వివరాల ప్రకారం, జూలై 5 తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య వాషింగ్టన్ డీసీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదైంది. ఈ పరిణామంపై అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, బాణసంచా ప్రదర్శన అద్భుతంగా సాగిందని, ప్రజలు వేడుకలను ఆస్వాదించారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో అమెరికాలో పర్యావరణ విధానాలు, వాతావరణ మార్పులు, ఉద్గార నియంత్రణ, శిలాజ ఇంధనాల వినియోగం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!