

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా టీఆర్ఎస్ చీఫ్ కవిత పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ వీసీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తేజశ్రీ 15 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కవిత ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయకుండా వీసీని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై బాధితురాలు గతంలో సుమారు ఎనిమిది గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పారని కవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె రెండు గంటలకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు.
ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం, కనీసం ఫిర్యాదు స్వీకరణకు సంబంధించిన రసీదు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనివల్ల మహిళా కమిషన్ పరిధిలో ఉన్న కేసు విచారణకు మరింత బలం చేకూరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ తేజశ్రీకి అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!