

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నిర్మాణ రంగం, భూగర్భ జలాల అధిక వినియోగంతో పాటు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. తెలంగాణ భూగర్భ జలశాఖ అక్టోబర్ 2026లో విడుదల చేసిన నివేదిక ప్రకారం కూకట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద భూగర్భ జలాలు 48.35 మీటర్ల లోతులో నమోదయ్యాయి. కేపీహెచ్‌బీలో 34.94 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటు నీటిమట్టం 12.59 మీటర్లకు పడిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 5.42 మీటర్లతో పోలిస్తే ఈసారి 7.17 మీటర్ల మేర తగ్గింది. సెప్టెంబర్‌తో పోల్చినా ఒక్క నెలలోనే 1.01 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది.
జీహెచ్‌ఎంసీ, పరిసర మున్సిపల్ ప్రాంతాల్లోని 46 మండలాల్లో 107 పీజోమీటర్ల ద్వారా అధికారులు నీటిమట్టాలను పరిశీలించారు. 2026 జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణంగా 729 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 484 మి.మీ. మాత్రమే కురిసింది. దీంతో 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 8.28 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 3.86 మీటర్ల మేర తగ్గింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 831 మి.మీ. కాగా, 628 మి.మీ. మాత్రమే నమోదై 24 శాతం లోటు ఏర్పడింది. జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్‌లో అత్యధికంగా 13.54 మీటర్ల లోతులో నీరు నమోదైంది. సంగారెడ్డిలో 12.93 మీటర్లు, రంగారెడ్డిలో 12.75 మీటర్ల లోతులో నీటిమట్టాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల రీచార్జి, బోరుబావుల వినియోగంపై నియంత్రణ వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!