

గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు తగ్గిన నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నగర అభివృద్ధి, పారిశుధ్యం, చెత్త నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరించాలని సూచించారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నిర్మాణ పనులు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు తాగునీటిని వినియోగించకుండా శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించాలని సీఎం సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి అందించే గ్రీన్ వాటర్ ట్యాంకర్లపై ప్రజలకు, సంబంధిత సంస్థలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తొలివిడతగా 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లోనూ ఈ సరఫరాను విస్తరించాలని తెలిపారు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రధాన రహదారులు, కూడళ్లలో రద్దీకి కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని ఆదేశించారు. సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా సిగ్నల్ ఫ్రీ రాకపోకలకు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!