

మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపైకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించనున్న గ్రాండ్ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి చిరంజీవికి ఏకంగా రూ. 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకు పనిచేసిన బివిఎస్ రవి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక కాన్సెప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ షూటింగ్‌లో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. నవంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తిచేసి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత చిరంజీవి టాక్ షోలో పాల్గొనే అవకాశముందని సమాచారం. ఆయన నటించిన ‘విశ్వంభర’ విడుదల తేదీపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!