

గిగ్ వర్కర్ల సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు తనకు తెలుసని అన్నారు. గిగ్ వర్కర్ల శ్రమను గుర్తించి వారికి అండగా నిలుస్తామని తాను, తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చామని గుర్తుచేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదని, డెలివరీకి ఎంత సమయం పడుతోంది, దానికి ఎంత పారితోషికం లభిస్తోంది వంటి వివరాలు కూడా స్పష్టంగా లేవని అన్నారు. కార్మికులే శ్రమిస్తున్నప్పటికీ, వారి పనికి సంబంధించిన సమాచారం వారి వద్ద ఉండటం లేదని వ్యాఖ్యానించారు. ప్రతి డెలివరీ ద్వారా వచ్చే ఆదాయ వివరాలను కార్మికులకు తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఎండల్లో మోటార్ సైకిళ్లపై ఎక్కువ సమయం ప్రయాణించే గిగ్ వర్కర్ల విశ్రాంతి కోసం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర నగరాల్లో రెస్ట్ హౌజ్‌లు ఏర్పాటు చేసినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కార్మికులకు రూ.5 లక్షలు, రూ.10 లక్షల బీమా కవరేజీతో పాటు పింఛను, ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రతి డెలివరీ, రవాణా లావాదేవీపై ఒక శాతం నిధులు గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు చేరి, అక్కడి నుంచి వారి ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. దేశంలో రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు ఉన్నాయని చెబుతూ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు కార్మికుల శ్రమను దోచుకునేలా ఉన్నాయని విమర్శించారు. గిగ్ వర్కర్లను దేశానికి కీలక భాగస్వాములుగా గుర్తించి వారికి రక్షణ, విశ్రాంతి, ప్రతి డెలివరీలో వాటా కల్పించాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల ఆరోగ్యం, పిల్లల చదువుకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!