

చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, కాకా సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కాకా చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు విశ్వంభర కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తిని పెంచింది.
శివుడికి సంబంధించిన ఓ ప్రవచన వీడియోను షేర్ చేసిన వశిష్ఠ.. ‘విశ్వంభరుడు’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ కవితాత్మకంగా క్యాప్షన్ పెట్టారు. విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలోనే ఈ పోస్ట్ చేశారనే చర్చ జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఫాంటసీ కథాంశంతో విశ్వంభర తెరకెక్కుతోంది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాణానంతర పనుల్లో జాప్యం కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మరోవైపు కాకా టీమ్ త్వరలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి రెండు కోణాల్లో కనిపించనుండగా, ఆయన కుమార్తె పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!