

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇటీవల ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తొలి సినిమా ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో జేసన్ సంజయ్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అట్లీ నిర్మాణంలో, ‘డ్యూడ్’ ఫేమ్ కార్తీశ్వరన్ దర్శకత్వంలో ఆయన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే, తాజాగా జేసన్ సంజయ్ తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. తనకు ఎలాంటి అధికారిక అభిమాన సంఘాలు లేవని స్పష్టం చేశారు. తన పేరు, ఫొటోతో ఎవరైనా నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టిస్తే వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఆ ఖాతాల నుంచి వచ్చే పోస్టులకు తాను బాధ్యుడిని కానని తెలిపారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా పంచుకుంటూ, వాటిని మాత్రమే అనుసరించాలని అభిమానులను కోరారు. తన పేరుతో అధికారిక అభిమాన సంఘం ఉందంటూ ఎవరైనా ప్రచారం చేస్తే నమ్మవద్దని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!