

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో మార్పులు చేపట్టే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి, ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళనపై నిర్ణయం తీసుకోవచ్చని కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. మారుతున్న రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో బీసీలకు ఉన్న ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో వారికి మరింత ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్‌లో చర్చకు వస్తోంది. అయితే మరో డిప్యూటీ సీఎం నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డిసెంబర్ 7 తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!