

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగకరమైన సాధన. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మనసుకూ ప్రయోజనం కలుగుతుంది. యోగాను ఉదయం మాత్రమే చేయాలనే నియమం లేదు. రోజంతా పని చేసి అలసిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు కొన్ని తేలికపాటి యోగాసనాలు చేయడం వల్ల శరీరంలోని ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా భాలాసనం, విపరీత కరణి వంటి ఆసనాలు శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. భాలాసనం వెన్ను, భుజాలు, తుంటి భాగాల్లోని ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. విపరీత కరణి రోజంతా నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కాళ్లలో ఏర్పడే అలసటను తగ్గించేందుకు సహాయపడుతుంది.
అలాగే మార్జర్యాసనం వెన్నుముకలోని జకడతను తగ్గించడంలో, కండరాలను సడలించడంలో ఉపయోగపడుతుంది. సుప్త బద్ధకోణాసనం తుంటి, తొడల కండరాలకు విశ్రాంతిని అందిస్తుంది. చివరగా శవాసనంలో ప్రశాంతంగా పడుకుని నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరం, మనసు విశ్రాంతి పొందుతాయి. ఈ ఆసనాలను ఒత్తిడి లేకుండా, శరీర సామర్థ్యానికి అనుగుణంగా చేయడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే యోగా సాధనకు ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!