

పీనట్ బట్టర్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే పీనట్ బట్టర్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి, తరచూ ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో బరువు నియంత్రణకు కూడా కొంతవరకు సహాయపడుతుంది. అయితే మార్కెట్లో లభించే కొన్ని రకాల పీనట్ బట్టర్లో అదనపు చక్కెర, ఉప్పు, ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల పదార్థాల వివరాలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. ఇంట్లోనే స్వచ్ఛమైన పీనట్ బట్టర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.
హోంమేడ్ పీనట్ బట్టర్ తయారీకి రెండు కప్పుల వేరుశెనగలు, కొద్దిగా ఉప్పు లేదా తేనె, అవసరమైతే ఒక స్పూన్ వేరుశెనగ నూనె తీసుకోవాలి. ముందుగా వేరుశెనగలను బాణలిలో దోరగా వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం వాటి పొట్టును తొలగించి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు వేరుశెనగల్లోని సహజ నూనెలు విడుదలై మిశ్రమం క్రమంగా పేస్ట్‌లా మారుతుంది. మరింత క్రీమీగా ఉండాలంటే అవసరాన్ని బట్టి కొద్దిగా వేరుశెనగ నూనె, రుచికి సరిపడా ఉప్పు లేదా తేనె కలుపుకోవచ్చు. ఇలా తయారైన పీనట్ బట్టర్‌ను శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. వేరుశెనగ అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!