

దివంగత మీడియా దిగ్గజం రామోజీరావు దేశంలోని సమస్యలపై అపారమైన అవగాహన, వాటి పరిష్కారాలపై స్పష్టమైన ఆలోచనలు కలిగిన దార్శనికుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం-2026లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. రామోజీరావుతో తనకున్న పరిచయాన్ని, అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న తనకు రామోజీరావు కారులో లిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. ఆయనను వివిధ సందర్భాల్లో నాలుగుసార్లు కలిశానని, ప్రతిసారీ ప్రపంచంలోని అనేక అంశాలపై ఆయనకున్న అవగాహన తనను ఆశ్చర్యపరిచేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాలు, ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద సమస్యలు వంటి అంశాలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేదని పేర్కొన్నారు. దేశ సమస్యలకు పరిష్కారాలు సూచించగల సలహాదారుడిగా రామోజీరావును భావించేవాడినని అమిత్ షా తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఓ సాధారణ గ్రామంలో జన్మించిన రామోజీరావు ఎలాంటి వారసత్వ సంపద, అవకాశాలు లేకుండానే కష్టపడి ఎదిగారని అమిత్ షా అన్నారు. జర్నలిజంలో ప్రత్యేక డిగ్రీ లేకపోయినా తన దార్శనికత, పట్టుదలతో ఈనాడు వంటి ప్రతిష్ఠాత్మక సంస్థను నిర్మించారని కొనియాడారు. తెలుగు పత్రికా రంగానికి, ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ వార్తలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లు ఎదురైనా విలువల విషయంలో రాజీ పడకుండా పోరాడారని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ద్వారా సినిమా రంగానికి కూడా విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. తొమ్మిది విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందించడం అత్యంత గౌరవప్రదమైన కార్యక్రమమని పేర్కొంటూ, పురస్కార గ్రహీతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రామోజీరావు పేరు మీద అవార్డు అందుకోవడం విజేతల జీవితాల్లో చిరస్మరణీయమైన గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!