

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రం నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ‘హార్ట్ ఆఫ్ కాకా’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్లో అనస్వర ‘అమ్ములు పాప’గా కనిపించనున్నారు. ఆమె వైద్య విద్యార్థినిగా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఇక ఆమె వెనుక చిరంజీవి నీడను చూపించడంతో.. కథలో ఆయన పాత్ర అమ్ములుకు రక్షణగా నిలిచే విధంగా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ‘కాకా’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!