

దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు అర్జున్ దాస్ తన తాజా చిత్రం ‘ఒన్స్ మోర్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దర్శకుడు విఘ్నేశ్ శ్రీకాంత్ తనపై ఉంచిన నమ్మకాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను హీరోగా తప్పిస్తే సినిమాను నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చినా దర్శకుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపారు.
చాలా కాలం క్రితమే విఘ్నేశ్ శ్రీకాంత్ ఈ కథను తనకు వినిపించారని అర్జున్ దాస్ చెప్పారు. పలు నిర్మాణ సంస్థలు హీరోను మార్చాలని సూచించినప్పటికీ, తాను అర్జున్ దాస్‌తోనే ఈ సినిమా చేస్తానని దర్శకుడు స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. చివరకు నిర్మాత యువరాజ్ గణేశన్ దర్శకుడి ఆలోచనపై నమ్మకంతో ముందుకు రావడంతో సినిమా ప్రారంభమైందన్నారు. అర్జున్ దాస్, అదితి శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఒన్స్ మోర్’ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోడల్ సోనా ఓలికల్ కీలక పాత్రలో కనిపించనుండగా, ‘హృదయం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాతో తమిళంలో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!