

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథలు, ఉత్కంఠభరిత చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తొలిసారిగా సూపర్ హీరో కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఎప్పటినుంచో ఈ కథను తెరపైకి తీసుకురావాలని భావించిన ఇంద్రగంటి, దాదాపు ఏడాదిన్నర పాటు ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు. కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యమిస్తూ కథను సిద్ధం చేశారు. ఈ పాత్ర కోసం రోషన్ తన రూపురేఖలు, శరీరాకృతిలోనూ ప్రత్యేక మార్పులు చేసుకుంటున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రేఖా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, తమిళ నటుడు వినయ్ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ పోరాట సన్నివేశాల రూపకల్పన కోసం హాలీవుడ్ నిపుణుడు లీ విట్టేకర్‌ను రంగంలోకి దించారు. రామకృష్ణ కూడా యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో భాగం కానున్నారు. పీజీ విందా ఛాయాగ్రహణం అందిస్తుండగా, గౌర హరి సంగీత బాధ్యతలు చేపట్టారు. అశోక క్రియేషన్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవంలో హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'జెంటిల్‌మన్', 'వి' వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి, ఈసారి యువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సరికొత్త సూపర్ హీరో ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. భారీ స్టార్ కాస్టింగ్‌పై ఆధారపడకుండా ప్రతిభావంతులైన యువతకు అవకాశం కల్పిస్తున్న ఆయన, కథను పక్కాగా తెరకెక్కిస్తే మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. మరి ఈ సూపర్ హీరో ప్రయోగంతో ఇంద్రగంటి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!