

బిగ్‌బాస్ తెలుగు 10లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. నవంబర్ 13న ప్రసారమైన 68వ రోజు ఎపిసోడ్‌లో త్రిగుణ్, నీతూ మాస్టర్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. ముందుగా త్రిగుణ్ భార్య, కూతురు అతడిని కలిశారు. ఎలాగైనా ట్రోఫీని ఇంటికి తీసుకురావాలని భార్య భావోద్వేగంగా కోరింది. వర్షిణి వల్ల తాను చాలా బాధపడ్డానని త్రిగుణ్ ఆమెతో చెప్పాడు. కాసేపు కూతురితో సమయం గడిపిన తర్వాత వారు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం నీతూ మాస్టర్ భర్త నటరాజ్ మాస్టర్, వారి కూతురు వచ్చారు. గేమ్‌పై దృష్టి పెట్టాలని, హౌస్‌లో జరిగే విషయాల గురించి ఆందోళన చెందవద్దని నటరాజ్ తన భార్యకు ధైర్యం చెప్పాడు. గేమ్‌లో ఏం జరిగినా ఏడవకూడదని సూచించాడు.
ఆ తర్వాత స్కూల్ టాస్క్‌లో కంటెస్టెంట్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న బిగ్‌బాస్, కెప్టెన్సీ పోటీలో అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించాడు. నంబర్లు రాసి ఉన్న షీట్లను నేలపై ఉంచి టాస్క్ నిర్వహించారు. బిగ్‌బాస్ ఒక నంబర్ చెప్పగానే కంటెస్టెంట్లు ఆ నంబర్ ఉన్న షీట్‌పై నిలబడాలి. స్థానం దక్కించుకోలేని వారు ఎలిమినేట్ అవుతారని, చివరకు మిగిలిన నలుగురు తదుపరి దశకు వెళ్తారని వివరించారు. ఈ పోటీలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మొదట సుధీర్ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత వర్షిణి, రాంప్రసాద్, నీతూ, దేబ్జానీ, శ్వేత, ముకేశ్ పోటీ నుంచి తప్పుకున్నారు. స్థానం కోసం జరిగిన పోటీలో త్రిగుణ్, శివ్ కూడా ఎలిమినేట్ అయ్యారు. చివరకు వంశీ, నరేశ్, అమన్, రామకృష్ణ తదుపరి దశకు అర్హత సాధించారు. కెప్టెన్సీ టాస్క్ శనివారం ఎపిసోడ్‌లో కొనసాగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!