

కల్ట్ బడ్డీ కామెడీ చిత్రం ఈ నగరానికి ఏమైంది విడుదలై ఎనిమిదేళ్ల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ దాని సీక్వెల్ ENE Repeatతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఓ కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసింది. మరోసారి పాత గ్యాంగ్ చేసే సందడి, వినోదభరిత ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను ట్రైలర్‌లో చూపించారు.
వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పి మరోసారి కలుస్తారు. అయితే ఈసారి వీరంతా కలిసి ఒక పూర్తి స్థాయి సినిమాను నిర్మించేందుకు ప్రయత్నిస్తారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వారు ఎదుర్కొనే సవాళ్లు, చోటుచేసుకునే గందరగోళం, కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. తరుణ్ భాస్కర్ తనదైన కథనశైలి, హాస్యాన్ని ఈ సీక్వెల్‌లోనూ కొనసాగించినట్లు కనిపిస్తోంది. ఎస్ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి భాగంలోని మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ కూడా పునరావృతం చేస్తుందో లేదో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!