

ఇటీవల తెలుగు సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు శ్రుతి మించుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కో విజయం తర్వాత అల్ట్రా వైలెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే చిత్రాల సంఖ్య పెరిగినట్లు కనిపిస్తోంది. గతంలో యాక్షన్ సన్నివేశాల్లో రక్తపాతాన్ని పరిమితంగా చూపించేవారు. కానీ ఇప్పుడు తలలు నరకడం, శరీర భాగాలు తెగిపడటం వంటి దృశ్యాలను నేరుగా తెరపై ప్రదర్శిస్తున్నారు. ప్యారడైజ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్లో అసహనాన్ని కలిగించాయి. రణబాలిలోనూ హింస ఎక్కువైందనే అభిప్రాయాలు వచ్చాయి. ఇక కుటుంబ కథాంశంతో వచ్చిన ఆదర్శ కుటుంబంలో సైతం తల నరికే సన్నివేశం ఉండటం చర్చకు దారితీసింది. దాన్ని అస్పష్టంగా చూపించినా ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇక విశ్వక్సేన్ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కల్ట్ విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది. ప్రచార చిత్రాల్లోనే హద్దులు దాటిన హింస కనిపించడంతో చాలామంది ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విడుదల రోజున హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ఆక్యుపెన్సీ తక్కువగా కనిపించిందని కథనాలు వెలువడ్డాయి. ప్రసాద్స్, ఏఎంబీ వంటి మల్టీప్లెక్సుల్లో మినహా పెద్దగా సందడి కనిపించలేదనే ప్రచారం సాగుతోంది. యువత కూడా ఇలాంటి సన్నివేశాలను విపరీతంగా ఆదరిస్తున్నారనే అభిప్రాయానికి భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. కథకు అవసరమైన మేరకే హింసను చూపించాలని, కేవలం సంచలనం కోసమే ఇలాంటి దృశ్యాలు పెట్టడం మానుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!