

ది మమ్మీ చిత్రాల సిరీస్‌లో ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రానాబాలితో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన ఆయన, తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్‌లో హైదరాబాద్ బిర్యానీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మటన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో పెరిగిన తనకు చిన్నప్పటి నుంచి ల్యాంబ్ మాంసం తినడం అలవాటని, ఇప్పటికీ చికెన్, బీఫ్ కంటే దానినే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. అయితే, హైదరాబాద్ బిర్యానీలోని కారం మాత్రం తనకు ఊహించని అనుభవాన్ని మిగిల్చిందని సరదాగా వివరించారు.
రానాబాలి షూటింగ్ సమయంలో తనకు బిర్యానీ వడ్డించారని, అది ఎంత కారంగా ఉంటుందని చెఫ్‌ను అడిగానని వోస్లూ తెలిపారు. అందుకు చెఫ్ అది పెద్దగా కారం లేని బిర్యానీ అని, పది పాయింట్లకు నాలుగు పాయింట్ల కారం మాత్రమే ఉంటుందని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ మాటలు నమ్మి బిర్యానీ రుచి చూడగా, కారం తీవ్రతకు తట్టుకోలేకపోయానని చెప్పారు. చిగుళ్లు మండిపోవడంతో పాటు చెమటలు పట్టాయని, వెంటనే ఉపశమనం కోసం పాలు, బీర్ లేదా ఏదైనా చల్లని పానీయం ఇవ్వాలని అడిగానని నవ్వుతూ వివరించారు. “నేను దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లవాడిని. నాకు 10లో 1.5 స్థాయి కారం ఉన్నా సరిపోతుంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన ఈ అనుభవం అభిమానులను నవ్వించేలా ఉంది. భవిష్యత్తులో మరో తెలుగు సినిమాలో నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన వస్తేనే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!