

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కల్ట్’ అక్టోబర్ 30న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో ఈ చిత్రం పోటీ పడనుంది. ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ సేన్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో అభిమానులతో ఫోటోలు దిగేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ఒక్కసారిగా జనసందోహం పెరగడంతో విశ్వక్ సేన్ కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఎంతో ఆశగా వచ్చిన అభిమానులు తమ అభిమాన నటుడితో ఫోటోలు దిగే అవకాశం దక్కక నిరాశతో వెనుదిరిగారు.
ఈ ఘటనపై విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకుంటూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అభిమానుల నుంచి వచ్చిన ప్రేమ, స్పందన తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరినీ కలవాలని అనుకున్నప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అది సాధ్యం కాలేదని వివరించారు. ఫోటోలు దిగే అవకాశం దక్కక నిరాశతో వెనుదిరిగిన ప్రతి ఒక్కరికీ సారీ చెప్పారు. త్వరలోనే మెరుగైన ఏర్పాట్లతో మరో ఫ్యాన్ ఫోటో సెషన్ నిర్వహించి, అందరికీ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. తనపై చూపిస్తున్న ప్రేమకు, ఎప్పుడూ అండగా నిలుస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అయినప్పటికీ, ముందుగానే భారీ జనసందోహాన్ని అంచనా వేసి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!