

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ఓ కార్యక్రమంలో దేశంలో గతంలో ఉన్నంత శాంతి ప్రస్తుతం కనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ముందుగా రూపొందించిన స్క్రిప్టెడ్ సంభాషణలో భాగమేనని, సరదాగా, హాస్యభరితంగా మాట్లాడేందుకు వాటిని రూపొందించారని తెలిపారు.
‘మున్నాభాయ్’ సినిమాలోని తన పాత్ర తరహాలో మాట్లాడాలని భావించానని సంజయ్ దత్ చెప్పారు. ప్రేమ, ఆప్యాయత, ఐక్యత, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందించడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన కార్యక్రమంలో దేశంలో శాంతి పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అలాగే, ఐదు నిమిషాల పాటు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారన్న ప్రశ్నకు మహాత్మా గాంధీ, మూడు కోతుల సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ.. తప్పును చూసినప్పుడు సరిదిద్దే ‘నాలుగో కోతి’ కూడా ఉండాలంటూ సరదాగా స్పందించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!