

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్, థ్రిల్, హ్యూమర్ అంశాలతో విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను వెల్లడించారు.
ఈ సినిమాకు తొలుత ‘చైనా పీస్’ అనే టైటిల్‌ను అనుకున్నామని హీరోలు తెలిపారు. అదే పేరుతో టీజర్, రెండు పాటలు విడుదల చేసి భారీగా ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. అయితే సినిమాను సెన్సార్‌కు పంపిన తర్వాత వివిధ స్థాయిల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ముఖ్యంగా ‘చైనా పీస్’ అనే టైటిల్ ఉండకూడదని సూచించినట్లు వెల్లడించారు. దీంతో కథ, దాని ఉద్దేశానికి ‘సీక్రెట్ సోల్జర్’ అనే టైటిల్ సరిపోతుందని భావించి పేరు మార్చినట్లు తెలిపారు. దర్శకుడు విశ్వనాథ్ కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, దృశ్యాల పరంగా స్వల్ప మార్పులు మాత్రమే సూచించారని చెప్పారు. ఈ స్పై డ్రామాలో యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా ఉంటాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!