

ప్రముఖ నటుడు జేవీ నారాయణరావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1953లో జన్మించిన నారాయణరావు గుంతకల్లు, హైదరాబాద్‌లో బాల్యం, విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నటనపై ఆసక్తితో నాటకాల్లోనూ పాల్గొన్న ఆయన, 1973లో మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తొలి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. అదే బ్యాచ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఉండటంతో ఇద్దరి మధ్య అప్పుడే స్నేహం ఏర్పడింది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నారాయణరావు, తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అనంతరం ‘ఒక ఊరి కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు.
హీరోగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో నారాయణరావు సహాయ, సహాయక పాత్రల్లో కొనసాగారు. తన సినీ ప్రయాణంలో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించడంతో పాటు టెలివిజన్ సీరియళ్లలోనూ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు సన్నిహిత అనుబంధం ఉండేది. ‘చట్టానికి కళ్లులేవు’, ‘మంచు పల్లకి’, ‘రాజా విక్రమార్క’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో చిరంజీవితో కలిసి నటించారు. అంతేకాకుండా చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలను నిర్మించారు. అనంతరం ‘యముడికి మొగుడు’ చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌తో రీమేక్ చేశారు. చిరంజీవి, రజనీకాంత్‌లతో తనకున్న స్నేహం, అనుబంధం గురించి నారాయణరావు పలు సందర్భాల్లో వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!