

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించడం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె.. నటిగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకోవడంతో పాటు, ‘లయర్స్ డైస్’, ‘మూథోన్’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే ‘టాక్సిక్’లో గ్యాంగ్‌స్టర్ కథ, పీరియడ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలతో పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. సినిమాలో హింస ఎక్కువగా ఉందంటూ కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. గీతూ మాట్లాడుతూ “నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి.. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ” అంటూ మాట్లాడిన పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ‘టాక్సిక్’కు సంబంధించినది కాదని తెలుస్తోంది.
గీతూ మోహన్‌దాస్ 1986లో మోహన్‌లాల్‌తో కలిసి ‘ఒన్ను ముతల్ పూజ్యం వరే’ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసి, తొలి చిత్రానికే కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్నారు. అనంతరం కథానాయికగా రాణించి ‘అకాలే’ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. 2009లో ‘కేట్కున్నుండో?’ షార్ట్ ఫిల్మ్‌తో దర్శకురాలిగా మారిన ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘లయర్స్ డైస్’ రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడంతో పాటు 87వ ఆస్కార్‌కు భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ‘మూథోన్’ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. సాధారణంగా సున్నితమైన మానవ సంబంధాల కథలను తెరకెక్కించే గీతూ.. ‘టాక్సిక్’తో భారీ యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి ఆమె భర్త, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి కెమెరా బాధ్యతలు నిర్వహించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!